关于అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన వాక్యములు
最后一本神书中的智慧之词:斯里·斯里·斯里·阿查里亚·普拉博丹达南达·瑜伽士
నేడు భూమిమీద మూడు గ్రంథములను మూడు సమాజముల వారు నాది ఈ గ్రంథము, నాది ఈ గ్రంథము అని పంచుకొని, నిర్ణయించు కొని మూడింటిని వారివారి గ్రంథములుగా చెప్పుకొంటున్నారు. ఎలా చెప్పుకొనినా ఆ గ్రంథములను వారు అందరూ చదువలేదు. చదివినా అవి అందరికీ అర్థము కాలేదు. గ్రంథము అను సూత్రము ప్రకారము అందులోని సమాచారము వారి బుర్రలకు, బుర్రలలోని బుద్ధికి అందలేదు. అలా బుద్ధి గ్రాహ్యమునకు రావాలంటే గ్రంథములో శక్తిరూపమైయున్న ఆత్మకు చదివేవాడు నచ్చియుండాలి. ఆత్మకు ఇష్టములేని వానికి గ్రంథము అర్థముకానట్లు ఆత్మ చేయుచున్నది. చదివిన తర్వాత వాని బుద్ధికి అది వాస్తవ భావములో కాకుండా వేరు భావములో అర్థమగుచున్నది. అందువలన నేడు గ్రంథములను వ్రాయువారు వేరు భావములో వాక్యమునకు అర్థమును వ్రాయడము జరుగుచున్నది. మేము చెప్పునది మూడు గ్రంథముల విషయములలో అలాగే కొనసాగుచున్నది. హిందువులకు భగవద్గీత అర్థము కాలేదు. క్రైస్తవులకు బైబిలు అర్థము కాలేదు. ముస్లీమ్ లకు ఖుర్ఆన్ అర్థము కాలేదు. భగవద్గీత అర్థము కాలేదు అని మేము వ్రాసిన "త్రైత సిద్ధాంత భగవద్గీత" బయటికి వచ్చిన తర్వాత చాలామందికి తెలిసినది. అలాగే క్రైస్తవులకు బైబిలు అర్థము కాలేదు అనుటకు మేము వ్రాయబోవు “సువార్త బైబిలు" బయటికి వచ్చిన తర్వాత తెలియగలదు. ఇకపోతే ముస్లీమ్ లకు ఖుర్ఆన్ గ్రంథము అర్థమయినదా, అర్థము కాలేదా అను విషయము ఇప్పుడు మేము వ్రాసిన “అంతిమ దైవగ్రంథములో జ్ఞాన వాక్యములు" అను ఈ గ్రంథము ద్వారా తెలియగలదు.
ఖుర్ఆన్ గ్రంథములో 114 సూరాలు, 6236 ఆయత్ లు గలవు. అందులో 112వ సూరా నా కిష్టమైనదిగా చెప్పుచూ అక్కడయున్న నాలుగు ఆయత్ లకు వివరము చెప్పాము. 114 సూరాలలో 112వ సూరా ఒక్క దానినే పూర్తి చెప్పినట్లయినది. 6236 వాక్యములలో కేవలము 136 సమాచారములకు మాత్రమే వివరమును వ్రాయగలిగాము. మేము వ్రాసిన 136 సమాచారములు దాచి పెట్టబడిన జ్ఞానముగల వాక్యములేయని చెప్పవచ్చును. 136 వాక్యములలోనూ భావములను తప్పుగా అర్థము చేసుకొన్నారని కొంతవరకు అర్థము కాగలదు. ముఖ్యముగా ఈ గ్రంథమును గురించి మేము చెప్పబోవునది ఏమనగా! ఇంతవరకు ఖుర్ఆన్ అర్థము కాకపోయినా ఇప్పుడు ఈ గ్రంథముతో ఎవరికయినా ఖుర్ఆన్ గ్రంథము అర్థము కాగలదు. కొన్ని వాక్యములను చూచిన వారు ముస్లీమ్ లు ఖుర్ఆన్లో ఇంత గొప్ప అర్థమున్నదా!యని కొందరూ, ఇంత గొప్ప వాక్యములున్నవా!యని మరి కొందరూ అంటున్నారు. ఖుర్ఆన్ గ్రంథమును ఇంతకు ముందే చదివి అర్థము చేసుకొన్నవారు ఈ గ్రంథమును చూచిన తర్వాత ఇంతవరకూ అర్థముకాని గ్రంథము ఇప్పుడు అర్థమయినదని కొందరు అంటున్నారు. తర్వాత మాకు అర్థమయినది వేరుగా యుండేది, దానికంటే ఇప్పుడే గొప్పగా అర్థమయినదని చెప్పుచున్నారు. ఇంతకుముందు ఎన్నడూ ఖుర్ ఆన్ చదువనివారు, అరబ్బీ భాషలో చదివి అర్థముకానివారు తెలుగు భాషలో మేము వ్రాసిన ఖుర్ఆన్ ను చదివిన తర్వాత ఖుర్ఆన్ గ్రంథములో ఇంత గొప్ప వాక్యములున్నవా! అంటున్నారు. ఈ గ్రంథమును చదివిన ప్రతి ఒక్కరినీ ఈ గ్రంథము ఉత్తేజపరచి దైవ జ్ఞానమును వారికి అందివ్వగలదు. అంతేకాక మిగతా మతములవారికి కూడా ఖుర్ఆన్ మీద కొంత అవగాహన ఏర్పడగలదు.